ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో హోంశాఖపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, దాడుల విషయంలో తీవ్ర భావోద్వేగానికి లోనైన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో శాంతి భద్రతలు పైనా, పోలీసుల విధుల పట్లనూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తట్టుకోలేకపోతున్నాను. నేరస్థులను కుల, మతాలకు అతీతంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. గతంలో మాదిరిగా అలసత్వం చూపకూడదు” అని ఆయన పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పై వివరణ ఇచ్చారు. “మీరు హోంశాఖ మంత్రిగా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మహిళల భద్రత కోసం మీరు చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయి. నేను హోంశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది” అని పవన్ హెచ్చరించారు.
అంతేకాకుండా, రాష్ట్రంలో జరిగే నేరాలపై తాను దృష్టి సారిస్తానని, అవసరమైతే యోగి ఆదిత్యనాథ్ తరహాలో చర్యలు తీసుకుంటానని పవన్ స్పష్టం చేశారు. “డీజీపీ తప్పులను సమీక్షించి, పోలీసులు చట్టపరంగా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజలకు రక్షణ కల్పించకపోతే చూస్తూ ఊరుకోను” అని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ ఈ సందర్భంలో ఎన్డీఏ కూటమికి కూడా తన మద్దతు ప్రకటిస్తూ, “మా పొత్తు స్థిరంగా ఉంది, ఎవరూ ఈ కూటమిని దెబ్బతీయలేరు” అని వివరించారు.
Recent Comments